ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సమీపిస్తోంది. వందల సంఖ్యలో
ఉన్న కాలేజీల్లో మంచి కెరియర్‌కు బాటలు వేసే సంస్థను ఎంపిక
చేసుకోవడం విద్యార్థులకు క్లిష్టమైన ప్రక్రియగా మారింది.
చాలామంది విద్యార్థులు తమకు తెలిసిన
ఓ పదీ పదిహేను కాలేజీల గురించి విచారించి, వాటిలో ఒకదాన్ని
సరైనదిగా భావించి చేరుతుంటారు. గత ప్లేస్మెంట్లు, వాటిలో సగటు,
గరిష్ఠ వేతనాలు,కాలేజీ ప్రాచుర్యం లాంటి వాటిని పరిశీలిస్తుంటారు. కెరియర్లో అత్యంత కీలకమైన కాలేజీ ఎంపికలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా చాలా ఉన్నాయి.
లక్షల సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంజినీరింగ్
కాలేజీల ఎంపిక గురించితలమునకలయ్యే సమయమిది. బాగా ప్రాచుర్యం ఉన్న కాలేజీలను ఎంచుకోవడానికి అనేకమంది ప్రయత్నిస్తుంటారు. నియామకాల కోసం కంపెనీలు ఏ కాలేజీలకు వెళ్తాయో వాటిలో చేరడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇవేవీ కాలేజీల్లోని వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించక
పోవచ్చు. ఐఐటీలు నాణ్యమైన విద్య ద్వారానే ప్రతిష్ఠాత్మక
సంస్థలుగా మారాయి. అనేక ఇతర విద్యాసంస్థలకు స్వీయ ప్రచారం వల్ల గొప్ప సంస్థలుగా ముద్ర పడి ఉండొచ్చు. కొన్ని చిన్న కాలేజీల్లో విద్యా ప్రమాణాలు బాగున్నప్పటికీ ప్రచారంపై దృష్టిపెట్టకపోవడం వల్ల'బ్రాండ్' విలువ లేకపోవచ్చు. |
ఈ పరిస్థితుల్లో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించే కాలేజీని
ఎంచుకోవడం ఎలా?కొన్ని అంశాల ఆధారంగా కాలేజీలను పోల్చుకొని మెరుగైన సంస్థను ఎంచుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది. కాలేజీ ఎంపిక మొత్తంగా కెరియర్‌పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి
ఎలాగైనా సరే సమాచారం రాబట్టడానికి కృషిచేయాలి.
అత్యంత కీలకం... అధ్యాపకులు పీహెచ్డీ డిగ్రీ గల అధ్యాపకులు కాలేజీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. పీహెచ్డీ లేకపోయినా బాగా బోధించే అధ్యాపకులు, పరిశోధకులు ఉండొచ్చు. కానీ ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎం.టెక్. డిగ్రీ ఎంతమందికి ఉందో పరిశీలించాలి. ఒకవేళ కాలేజీలో బీటెక్, ఎం.ఎస్సి. అర్హతలు గల అధ్యాపకులు ఎక్కువగా ఉంటే ఆశించినరీతిలో
విద్యా ప్రమాణాలు లేకపోవచ్చు. అధ్యాపకులు తమ ఉన్నత డిగ్రీలను ఏ
సంస్థల్లో చేశారోచూడాలి. మంచి పేరున్న సంస్థల్లో చదువుకున్న వారు ఎక్కువగా ఉంటే ప్రమాణాలుమెరుగ్గా ఉండొచ్చు. అదే కాలేజీలో ఉన్నత విద్య చదివినవారు అధ్యాపకులుగా ఉండటం ఓవిధంగా నాణ్యతా లేమికి సూచిక. అదే కాలేజీలో చదివాక, ఉన్నత విద్య పేరున్న సంస్థలో
చేసినవారు ఉంటే సానుకూలంగా ఆలోచించవచ్చు.
అధ్యాపకులు పరిశోధనల్లో ఎంత క్రియాశీలకంగా ఉన్నారనేది కూడా ముఖ్యం. పరిశోధనలపై ఆసక్తి ఉంటే సబ్జెక్టులోని తాజా అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా మెరుగ్గా బోధించవచ్చు.
బాగా బోధించాలంటే అత్యుతమ పరిశోధకులు కావాల్సిన
అవసరం లేదు. కానీ ఎలాంటి పరిశోధనలు చేయకుండా బాగా బోధించడం కష్టం. అధ్యాపకుల పబ్లికేషన్లను కూడా పరిశీలించాలి. పేరున్న జర్నళ్లలో, సమావేశాల్లో అవి ప్రచురితమైతే మంచిది.
పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలు నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టులు
అధ్యాపకులకు వస్తున్నాయేమో తెలుసుకోవాలి. ఇలా వస్తే వారి
పరిశోధనలకు ఇతరులు విలువ ఇస్తున్నట్లు భావించవచ్చు.
అధ్యాపకులు, విద్యార్థుల శాతం కూడా ముఖ్యమైన అంశం.
తరగతిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే నేర్చుకోవడానికి అవకాశం మెండుగా ఉంటుంది. అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా
ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. అధ్యాపకులు తక్కువగా
ఉంటే వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలకు
సమయం దొరక్కపోవచ్చు. బోధనపై ఇది వ్యతిరేక
ప్రభావాన్ని చూపిస్తుంది. పని ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో
మరిన్ని అసైన్మెంట్లు,ప్రాజెక్టులు ఇవ్వడం కూడా కుదరకపోవచ్చు.
మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యం
ఫ్యాకల్టీ తర్వాత విద్యార్థులు పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశం... మౌలిక సౌకర్యాలు. మీరు ఎంచుకునే సబ్జెక్టుకు సంబంధించిన ప్రయోగశాలల నాణ్యత బాగుండాలి. నూతన సాంకేతిక
పరిజ్ఞానం ల్యాబ్‌లో ఉండాలి. విద్యార్థులు అందరికీ సరిపడా
పరికరాలు ఉండాలి. ల్యాబ్ ఇన్స్ట్రక్టర్డెమోతో సరిపెట్టే విధంగా కాకుండా, విద్యార్థులు అందరూ ఒకేసారి ప్రయోగాలు నిర్వహించడానికి
అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలి.లైబ్రరీలో ఒక్కో విద్యార్థికి సగటున
ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎలాంటి ఇ-జర్నల్‌లు తెప్పిస్తున్నారు?
లెక్చర్ హాళ్లలో పీసీలు, ప్రొజెక్టర్, స్క్రీన్, ఆడియో సౌకర్యాలు ఉన్నాయా?
క్రీడా సౌకర్యాల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు కాలేజీ వెబ్సైట్ ద్వారా
మాత్రమే సమాధానాలుతెలుసుకోవడం కష్టం. ప్రస్తుత విద్యార్థులు
లేదా పాత విద్యార్థులతో మాట్లాడితేనే ఈ విషయాలు సమగ్రంగా
తెలుస్తాయి. వ్యక్తిగతంగా కాలేజీని సందర్శించడం మరో మంచి మార్గం.
ఇవి కూడా ముఖ్యం...
ఫ్యాకల్టీ, మౌలిక సౌకర్యాల తర్వాత, ఇంజినీరింగ్ కాలేజీ ఎంపికలో కింది అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. కాలేజీని ఎప్పుడు
ప్రారంభించారో చూడాలి. స్వయం ప్రతిపత్తి ఉంటే, అది ఎప్పుడు
లభించింది? అక్రెడిటేషన్ ఎప్పుడు వచ్చింది? మొదలైన అంశాలను
పరిశీలించాలి. * ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఉన్నత కోర్సులకు వెళ్తుంటే, వారిలో చదువు పట్ల ఆసక్తిని, ప్రేరణను పెంపొందించడంలో
విద్యాసంస్థ విజయం సాధించినట్లు భావించవచ్చు.
* గేట్, క్యాట్, ఇతర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభతోపాటు,యూనివర్సిటీ ర్యాంకులు, బంగారు పతకాలు సాధిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటే ఆ కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
* పాత విద్యార్థుల సంఘం క్రియాశీలకంగా ఉంటే ఆ కాలేజీ పట్ల
సానుకూలంగా ఆలోచించవచ్చు. ముఖ్యంగా 10-15 ఏళ్ల కిందట
ప్రారంభించిన కాలేజీల్లో పాత విద్యార్థుల సంఘాల కార్యకలాపాలు
బాగుంటే వాటిలో చేరవచ్చు.
* ఆరోగ్యాన్ని పెంపొందించే పరిశుభ్రమైన క్యాంటీన్లు, రవాణా సౌకర్యం, హాస్టల్ సదుపాయం ఉండాలి. * సాఫ్ట్ స్కిల్స్‌పై కాలేజీలో ఏమేరకు శ్రద్ధపెడుతున్నారో చూడాలి. సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ,
వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, మ్యూజిక్ క్లబ్‌లు, ఇతర వినోదాత్మక
కార్యక్రమాలను నిర్వహించే కాలేజీని పరిగణించవచ్చు.
* విద్యార్థులను ప్రోత్సహించే విధంగా స్కాలర్షిప్లు ఇవ్వడం, వారి
సంక్షేమం కోసం కౌన్సెలింగ్,సమావేశాలు నిర్వహిస్తుంటే మంచిది.
ఈ సమాచారం అంతా సేకరించడం కష్టమని విద్యార్థులు, తల్లిదండ్రులు
భావించవచ్చు. కానీ మీరు చేరాలనుకుని, బాగా దృష్టిపెట్టిన కొన్ని కాలేజీల గురించి ఈ వివరాలు తెలుసుకోవడం అసాధ్యం కాదు. కాలేజీ వెబ్సైట్లో పూర్తి సమాచారం లభించకపోతే, ఇతర ప్రొఫెషనల్ వెబ్సైట్ల ద్వారా తోటి విద్యార్థుల సలహాలు కోరవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా కూడా కొన్ని కాలేజీల విద్యార్థులు అందుబాటులోకి రావచ్చు. ఈ అంశాలపై కొంత సమయం వెచ్చించడం
ద్వారా కాలేజీ ఎంపికలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
|